తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి

  • నర్సంపేటలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో
  • తెలంగాణ ఉద్యమకారులకు సమావేశం

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదని, ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని నర్సంపేట నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ బోడ అనిల్ నాయక్ స్పష్టం చేశారు.

ఆదివారం నర్సంపేటలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు గొంగళ్ల రంజిత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వేలాది మంది ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పెన్షన్లు, ఉద్యోగాలు కల్పిస్తామని గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తోందని ఆరోపించారు.

ఉద్యమకారుల సంక్షేమం పేరుతో కమిటీలు ఏర్పాటు చేయడం మినహా ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం గళమెత్తాలని కోరారు.

ఈ సందర్భంగా డాక్టర్ బోడ అనిల్ నాయక్ మాట్లాడుతూ, నర్సంపేట నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం, భూహక్కులు, సామాజిక భద్రత కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రతి దశలో వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

మద్దికాయల రాంబాబు మాట్లాడుతూ, ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. భూహక్కులు, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత కల్పించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మల్లేష్, రాము, అంజిరెడ్డి, రాజేష్, వంశీ, వినోద్, మహేందర్, వెంకట్ తదితర తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.