Murder Case | పూణే హత్య కేసు.. సీన్‌ రీక్రియేషన్‌ పోలీసుల ఆసక్తికర ప్రయోగం

Murder Case | పూణే హత్య కేసు.. సీన్‌ రీక్రియేషన్‌ పోలీసుల ఆసక్తికర ప్రయోగం

Murder Case | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతుంది. కాబోయే భార్యే ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలడంతో, కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇందులో భాగంగా ఆదివారం నిందితురాలు సియా గోయల్‌ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి, క్రైమ్ సీన్‌ను రీక్రియేషన్‌ చేశారు.

పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ సమాచారం ప్రకారం.. నిందితులు జూన్ 18న ఏ మార్గంలో వచ్చారు, కొండపై ఎక్కడ నిలబడ్డారు, కేతన్‌ను ఎలా కిందికి నెట్టేశారు అనే అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో నిందితురాలు సియా గోయల్ స్వయంగా ఆ రోజు జరిగిన సంఘటనలను అధికారుల ముందు వివరించింది.

అయితే, నిందితులు చెబుతున్న వివరాలు నిజమో కాదో తెలుసుకోవడానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ తోంపే నేతృత్వంలో ఒక ఆసక్తికర ప్రయోగం చేపట్టారు. మృతుడు కేతన్ బరువుతో సమానంగా ఉండేలా ఒక డమ్మీ బొమ్మను ప్రత్యేకంగా తయారు చేసి, కోట పైనుంచి లోయలోకి పడేశారు. శీర్షిక ఆధారంగా నిందితుల వాంగ్మూలాన్ని సరిచూడడానికే ఈ వినూత్న ప్రయోగం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసింది!
మహారాష్ట్రలోనే భారీ ఎత్తున వేర్‌హౌస్ వ్యాపారాలు చేసే ‘సక్సెస్ గ్రూప్’ సంస్థకు కేతన్ అగర్వాల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పూణేలోని మరో సంపన్న కుటుంబానికి చెందిన సియా గోయల్ (20)తో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇతనికి నిశ్చితార్థం జరిగింది. రాబోయే నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా పెళ్లి జరగాల్సి ఉంది. హోటల్ బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి.

కానీ, సియా గోయల్‌కు అప్పటికే చేతన్ చౌదరి (22) అనే యువకుడితో రహస్య ప్రేమాయణం ఉంది. ఈ పెళ్లి ఇష్టం లేని సియా, తన ప్రియుడితో కలిసి కేతన్‌ను హతమార్చాలని పథకం వేసింది. ప్లాన్ ప్రకారం జూన్ 18న లోహగఢ్ కోటకు ట్రెకింగ్‌కు పిలిచి, అక్కడ ఎవరూ లేని సమయం చూసి అతడిని కొండపై నుండి లోయలోకి తోసేశారు. తొలుత ఇదొక ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పోలీసుల లోతైన దర్యాప్తులో ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.