పోలియో రహిత రాష్ట్రానికి ప్రతి తల్లిదండ్రి సహకారం అవసరం.. కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపు
ఏలూరు జిల్లాలో 2 లక్షల మందికిపైగా చిన్నారులకు పల్స్ పోలియో లక్ష్యం.. 1,094 కేంద్రాల ఏర్పాటు
ఏలూరు, ఆంధ్రప్రభ: తమ చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా వాక్సిన్ వేయించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక 24వ డివిజన్ శాంతినగర్‌లోని ఫిరంగులదిబ్బలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా పోలియో కేసులు నమోదు కాకపోయినా, పొరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జూన్ 28 నుంచి 30 వరకు ఏలూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఐదేళ్లలోపు 2,00,073 మంది చిన్నారులు ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు అందించేందుకు 1,094 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం మొత్తం 2,79,861 డోసులను సిద్ధం చేసినట్లు చెప్పారు.
జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 799, గిరిజన ప్రాంతాల్లో 181, పట్టణ ప్రాంతాల్లో 114 పోలియో కేంద్రాలతో పాటు 46 ట్రాన్సిట్ బూత్‌లు, 80 మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమం నిర్వహణ కోసం మొత్తం 4,814 మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిపారు.
బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు చుక్కలు వేస్తున్నామని చెప్పారు. వలస కూలీలు, అసంఘటిత కార్మికుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
జూన్ 28న ఏ కారణం చేతైనా పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులను 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి గుర్తించి పోలియో వ్యాక్సిన్ అందజేస్తామని తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో నూరుశాతం లక్ష్యాలను సాధించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ప్రతి తల్లిదండ్రి తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో వ్యాధి నుంచి రక్షణ కల్పించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీఎంహెచ్‌వో డా. యు. శోభ, డీఈఎంఓ శ్రీనివాసరావు, వైద్యాధికారులు డా. రాజు, డా. పూజ, వైద్యశాఖ సిబ్బంది రవి, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
