ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
డిజిటలైజేషన్‌లో వంద శాతం ఖచ్చితత్వం పాటించాలని అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ ఆదివారం బుక్కపట్నం సచివాలయంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ–2026 (Special Intensive Revision–2026) కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి, పనుల పురోగతిని సమీక్షించారు.
తనిఖీలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ, స్కానింగ్, వెరిఫికేషన్, ఎన్యూమరేషన్ ఫారాల అప్‌లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఓటర్ల నమోదు, సవరణల డిజిటలైజేషన్‌లో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా వంద శాతం ఖచ్చితత్వంతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
డేటా ఎంట్రీ, వెరిఫికేషన్ సమయంలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పాటించాలని, భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని బీఎల్ఓలు, ఏఈఆర్‌ఓలు, ఈఆర్‌ఓలకు సూచించారు.
ఈ తనిఖీలో సచివాలయ సిబ్బంది, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
