ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు
పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
రెండేళ్లలోనే రూ. 2.5 లక్షల కోట్ల అప్పులు
అమరావతిలో వైఎస్సార్సీపీ బృందంపై జరిగిన దాడి సరైనది కాదు
పోలీసుల సమక్షంలోనే అరాచకం
విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి పీవీ నరసింహారావు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. విజయవాడ సత్యనారాయణపురం బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పీవీ నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూ సంస్కరణల ద్వారా తన సొంత భూమినే ప్రజల కోసం త్యాగం చేసిన ఆదర్శప్రాయుడు పీవీ అని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు పీవీ చూపిన బాటలోనే నడిచి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారని స్పష్టం చేశారు. పీవీ ఆర్థిక సంస్కరణలను చూసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంతో నేర్చుకోవాలని హితవు పలికారు. అలాగే అమరావతిలో వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కేవలం రెండేళ్లలోనే రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, ప్రతి సోమవారం రాష్ట్రాన్ని ‘అప్పుల ఆంధ్రప్రదేశ్’ గా మారుస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం, ఫీజ్ రీఇంబర్స్మెంట్, మహిళల డ్వాక్రా రుణాల చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
అమరావతి దాడి ఘటనపై ఆగ్రహం…
ఇటీవల అమరావతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందంపై జరిగిన దాడిని మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టపోతున్న అమరావతి రైతుల పిలుపు మేరకే తమ పార్టీ బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళిందని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేతల కార్లను అడ్డుకుని.. బండరాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేశారని ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడటంలో, ఘర్షణలను నివారించడంలో పోలీసు యంత్రాంగం దారుణంగా విఫలమైందని విమర్శించారు. చివరికి దాడికి గురైన బాధితులపైనే రివర్స్‌లో ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీని చూసి ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. అమరావతి పనులను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బాధితులైన రైతుల పొలాల్లో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను, వివక్షను మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఒక్క అమరావతిలోనే రూ. 50 వేల కోట్లు కేంద్రీకరించడం సరికాదన్న ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సమాంతర అభివృద్ధికి ‘వికేంద్రీకరణే’ ఏకైక మార్గమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
