Revanth Reddy Fan Letter | రేవంత్‌కు అభిమాని బహిరంగ లేఖ

Revanth Reddy Fan Letter | రేవంత్‌కు అభిమాని బహిరంగ లేఖ

మీరంటే నాకు ఇష్టం
రైతుల సమస్యలపై ఆవేదన
యూరియా యాప్‌, రైతుబంధుపై పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి
వ్యవసాయ రంగంలో అసంతృప్తి పెరుగుతోందంటూ లేఖలో పేర్కొన్న అభిమాని

Revanth Reddy Fan Letter | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనను అభిమానినిగా పేర్కొంటూ కామారెడ్డి జిల్లాకు చెందిన జి. వెంకట్‌రావు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని అంశాలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని ఆ లేఖలో కోరారు.

లేఖలో సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని పేర్కొన్న వెంకట్‌రావు, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామాలు, మండలాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రత్యేకంగా యూరియా యాప్ అమలుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన, ఇతర రాష్ట్రాల్లో లేని ఈ విధానాన్ని తెలంగాణలో అమలు చేయడంపై పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రైతులకు గతంలో మాదిరిగానే రైతుబంధు పథకాన్ని కొనసాగించాలని కోరారు.

ఈ రెండు అంశాల కారణంగా వ్యవసాయ రంగంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, గ్రామాల్లో ఇప్పటికీ రైతుబంధు వంటి పథకాల కారణంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రైతులు గుర్తు చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఈ లేఖ ఇలా రాసి ఉంది..

మీరంటే నాకు చాలా ఇష్టం.. మీ గురించి, ప్రభుత్వం గురించి రైతులు ప్రతి సొసైటీ దగ్గర తిడుతుంటే నేను విని భరించలేకపోతున్నాను. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో వ్యవసాయరంగం 65 శాతం పైగా ప్రభుత్వానికి, మీకు వ్యతిరేకత ఉంది.. మీరు దానిని గమనించడం లేదు. ఏ రాష్ట్రంలో లేని యూరియా యాప్ మన రాష్ట్రంలో ఎందుకు?.. ఈ యాప్‌ను తీసి వేయగలరు. మిమ్మల్ని నమ్ముకున్న రైతులకు యధావిధిగా రైతుబంధు వేయగలరు. ఈ రెండు పథకాలు చేయకనే వ్యవసాయరంగం మీకు వ్యతిరేకతగా ఉంది.. ఈ రెండు పథకాలు వల్ల కేసీఆర్ గారిని గ్రామాలలో ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.
ఇట్లు
మీ అభిమాని G. వెంకట్ రావు
జిల్లా కామారెడ్డి