నేరాల కట్టడికే కార్డన్ అండ్ సెర్చ్: సీఐ పవన్‌కుమార్

చిన్నగూడూరు, ఆంధ్రప్రభ: నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మరిపెడ సీఐ పవన్‌కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు, తొర్రూర్ డీఎస్పీ పర్యవేక్షణలో చిన్నగూడూరు ఎస్‌ఐ కుశకుమార్ ఆధ్వర్యంలో మంగోలీగూడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు, క్యూఆర్టీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సుమారు 250 ఇళ్లను తనిఖీ చేసి అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం, గుడుంబా, పటికను స్వాధీనం చేసుకోగా, గుడుంబా తయారీకి వినియోగిస్తున్న సుమారు 3 వేల లీటర్ల నల్లబెల్లం ఊటను ధ్వంసం చేశారు.

అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో రహదారి భద్రత, హెల్మెట్ వినియోగం, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా, మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాల నిషేధంపై అవగాహన కల్పించారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు. కార్యక్రమంలో మరిపెడ, సీరోల్ ఎస్‌ఐలు, సర్కిల్ పోలీసు సిబ్బంది, క్యూఆర్టీ బలగాలతో కలిపి 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.