Police Conduct | ఒక ఫొటో… వెయ్యి మాటలు..
Police Conduct | ఒక ఫొటో… వెయ్యి మాటలు..
Police Conduct | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఒక ఫొటో… వెయ్యి మాటలు చెబుతుందని అంటారు. రాజస్థాన్‌లో వైరల్ అయిన ఆ ఒక్క ఫొటో కూడా అంతే. పోలీస్ స్టేషన్‌కు తన బాధ చెప్పుకోవడానికి వచ్చిన ఓ వృద్ధుడు ఎదుట కూర్చుని ఉంటే… డెస్క్‌పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చున్న మహిళా కానిస్టేబుల్. ఆ ఫొటో చూసినవారికి ముందుగా కోపం వస్తుందో… బాధ కలుగుతుందో… లేక ప్రజాస్వామ్యం ఎటు వెళ్తోందో అన్న ఆందోళన కలుగుతుందో చెప్పడం కష్టం.
చాలామంది ఈ ఘటనలో కనిపించింది ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రమే అనుకోవచ్చు. కానీ, నిజానికి ఆ ఫొటోలో కనిపించింది ఒక్క వ్యక్తి కాదు… కొందరు అధికారుల్లో పెరుగుతున్న ప్రజల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం.
ప్రభుత్వ ఉద్యోగం అంటే అధికారం కాదు… అప్పగించిన బాధ్యత. యూనిఫాం అంటే భయపెట్టే దుస్తులు కాదు… ప్రజలకు భరోసా ఇచ్చే నమ్మకం. పోలీస్ స్టేషన్ అంటే ప్రజలు చివరి ఆశతో అడుగుపెట్టే స్థలం. అక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ముందు నిలబడినవాడు నేరస్థుడు కాకపోవచ్చు… తన సమస్యతో వచ్చిన సామాన్యుడే కావచ్చు.
ఆ వృద్ధుడు అక్కడికి ఎందుకు వచ్చాడో మనకు తెలియదు. తన భూమి కోసం వచ్చాడా? కుటుంబ సమస్యతో వచ్చాడా? లేక ఎవరైనా తనను మోసం చేశారని ఫిర్యాదు చేసేందుకా? కానీ, అతని సమస్య కంటే ముందు అతని కళ్లకు కనిపించింది టేబుల్‌పై పెట్టిన రెండు కాళ్లు. బహుశా… “నీ సమస్య కంటే నా సౌకర్యమే ముఖ్యం” అనే మౌన సందేశం.
ఇలాంటి దృశ్యాలు దురదృష్టవశాత్తూ ఒక్క పోలీస్ స్టేషన్‌కే పరిమితం కావు. కార్యాలయాలు మారుతాయి… కుర్చీలు మారుతాయి… పేర్లు మారుతాయి… కానీ కొందరి వ్యవహారశైలి మాత్రం మారదు. ఫైల్‌తో వచ్చిన రైతు గంటల తరబడి నిలబడతాడు. పెన్షన్ కోసం వచ్చిన వృద్ధుడు బెంచీ కోసం చూస్తాడు. సర్టిఫికెట్ కోసం వచ్చిన విద్యార్థి కిటికీల చుట్టూ తిరుగుతాడు. కానీ, కుర్చీలో కూర్చున్న కొందరికి మాత్రం సమయం కదలదు… ప్రజలే కదలాలి.
ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అవినీతి మాత్రమే కాదు… ప్రజలను చిన్నచూపు చూడటం కూడా. ఎందుకంటే డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ, ఒకసారి ప్రజల మనసులో ప్రభుత్వ అధికారులు, వ్యవస్థలపై నమ్మకం పోతే… దాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం.
రాజస్థాన్‌లో ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. అది క్రమశిక్షణాపరమైన చర్య మాత్రమే. కానీ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే సస్పెన్షన్ ఒక్కటే సరిపోదు.అంతకంటే ఎక్కువ అవసరం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక విషయం గుర్తుంచుకోవాలి.
టేబుల్ మీది… కానీ కుర్చీ ప్రజలది.
ఎందుకంటే ఆ టేబుల్, ఆ కుర్చీ, ఆ జీతం… అన్నీ ప్రజల పన్నుల డబ్బుతోనే నడుస్తున్నాయి. ప్రజలకు సేవ చేయడానికే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది… ప్రజలను నిలబెట్టి, తన కాళ్లు టేబుల్‌పై పెట్టుకోవడానికి కాదు.
యూనిఫాం వేసుకున్న ప్రతివాడు గౌరవించబడాలి. కానీ, ఆ గౌరవాన్ని నిలబెట్టేది భుజంపై ఉన్న బ్యాడ్జ్ కాదు… ఎదురుగా నిలబడిన సామాన్యుడితో ఎలా మాట్లాడాడన్నదే.
చివరగా ఒక్క ప్రశ్న…
ప్రజలు కార్యాలయాలకు సమస్యలతో వస్తున్నారా… లేక అధికారుల అహంకారాన్ని చూసి వెనుదిరగడానికా?
