ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికతో పాలన మరింత చేరువ

  • పకడ్బందీగా భవిష్యత్తు ప్రణాళికలు రూపకల్పన
  • ప్రత్యేక అధికారి, ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో పాలన ప్రజలకు మరింత చేరువైందని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు.

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, వివిధ ఫైళ్ల పరిష్కారం, భవిష్యత్ ప్రణాళికలపై జిల్లా యంత్రాంగం రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి శైలజా రామయ్యర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి శాఖ తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా రూపొందించుకోవాలని, 99 రోజుల కార్యక్రమంలో సాధించిన విజయాలను డాక్యుమెంటరీ రూపంలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రాల నిర్వహణ, రోడ్డు భద్రతలో భాగంగా సీపీఆర్ శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాల్లో సాధించిన పురోగతిని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఆర్డీఓ జయశ్రీ, సీపీఓ శ్రీనివాసాచారి, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా పశువైద్యాధికారి రవీందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.