తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్‌లో సిరివల్లి ప్రతిభ..

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, రాష్ట్ర సోషల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ (టీ-మన్) కార్యక్రమంలో జూలపల్లి మండలం పెద్దాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థిని ఎస్. సిరివల్లి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో చాటింది. ఈ సందర్భంగా శనివారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, ఐఏఎస్ సిరివల్లిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మోడల్ యునైటెడ్ నేషన్స్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం గర్వకారణమని అన్నారు. సిరివల్లి సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ విజయానికి గాను సిరివల్లిని, ఆమె తల్లిదండ్రులను, పాఠశాల ప్రిన్సిపాల్ సరిత, ఉపాధ్యాయ బృందాన్ని జిల్లా విద్యాధికారి జి. శారద, మండల విద్యాధికారి సరస్వతి, గ్రామ ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరివల్లికి మార్గదర్శకత్వం వహించిన ప్రిన్సిపాల్ సరిత, ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.