గూగూడు, పరిసరాలలో డ్రోన్ల ద్వారా నిఘా…

అనంతపురం సిటీ, ఆంధ్రప్రభ : నార్పల మండలం ​గూగూడు కుళ్ళాయిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు… ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. క్షేత్ర పరిధిలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతే కాకుండా… గూగూడు, పరిసర ప్రాంతాలలో డ్రోన్లు ఎగురవేశారు. ​భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు.

ఉత్సవ ప్రాంగణాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, క్యూ లైన్లు, గ్రామ పరిసరాలు, ప్రధాన రహదారులపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. క్షేత్రంలోని ప్రతి కదలికను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి సిబ్బంది 24/7 నిశితంగా పరిశీలిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తూ, ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉత్సవాల వేళ భక్తులు తమ విలువైన నగలు, పర్సులు మరియు మొబైల్ ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.