డ్రగ్స్‌పై పోలీసుల బైక్ ర్యాలీ.. యువతకు కీలక హెచ్చరిక
మరిపెడ, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ సెంటర్లో స్థానికులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా సీఐ ఎల్. పవన్ కుమార్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశమేనని, ప్రస్తుత పరిస్థితుల్లో యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గండ్రాతి సతీష్, అదనపు ఎస్సై ప్రభాకర్ రెడ్డి, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
