మొహారం పండుగలో ఉట్టిపడిన మతసామరస్యం
పీర్ల ఊరేగింపులో పోటెత్తిన జనం
జుక్కల్, ఆంధ్రప్రభ : కార్బల మైదానంలో హజ్రత్ ఇమామే హుస్సేన్ త్యాగాలు, సత్యం, ధర్మం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించే పీర్ల (మొహరం) పండుగను జుక్కల్ మండల కేంద్రంతో పాటు అయ గ్రామాలలో శుక్రవారం 10వ రోజున చివరిరోజు కావటంతో ప్రజలు పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముఖ్యంగా బాన్స్ వాడ డివిజన్ ప్రాంతంలో జుక్కల్ మండల కేంద్రంలో మొహరం పండుగ అతి పెద్ద పండుగగా కొనసాగుతుంది. సాయంత్రం పీర్ల ఊరేగింపు కనులవిందుగా కొనసాగింది.
ముఖ్యంగా హజ్రత్ బిబీ ఫాతిమాపీర్లు, హజ్రత్ ఇమామే హుస్సేన్, హజ్రత్ కాసింధులే, హజ్రత్ నలేహైదర్ తదితర పీర్లను ఊరేగించడం జరిగింది. గాంధీ చౌక్ మీదుగా బురుడ్ గల్లీ మీదుగా ఊరేగింపు కొనసాగింది. కులమతాలకు,అతీతంగా తెలంగాణ, కర్ణాటక,మహారాష్ట్ర నుండి వేలాదిగా భక్తులు, ప్రజలు పాల్గొని పీర్ల ఊరేగింపును వీక్షించారు. ఈసందర్భంగా భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ పీర్ల ఊరేగింపు రాత్రి పొద్దుపోయేంత వరకు కొనగగింది. పీర్ల ఊరేగింపు సజావుగా కొనసాగేందుకు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తమవంతు సహాయసహకారాలు అందించారు. జుక్కల్ లోని ప్రతి ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడింది. సందర్భంగా జాతర ఏర్పాటు అయింది.
