శభాష్.. మరింత బాగా పనిచేయాలి!
- తిరుపతి పోలీసులకు డీజీపీ ప్రశంసలు
- పోలీస్ సంక్షేమ పనులకు శంకుస్థాపన
- సాంకేతిక పోలీసింగ్‌పై సమీక్ష..
- డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ చర్యలపై అభినందనలు
- రోడ్డు భద్రత, మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలపై ప్రశంసలు
- శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పనితీరుకు కితాబు
తిరుపతి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో పోలీసుల సంక్షేమం, ఆధునిక పోలీసింగ్‌కు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి పలు సంక్షేమ మౌలిక వసతుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత, పోలీస్ సంక్షేమం, సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్, ప్రధాన ప్రవేశ ద్వారం (గ్రౌండ్ గేట్), కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, డీజీపీ సతీమణి, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
డీజీపీకి వివరించిన ఎస్పీ..
అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో అమలవుతున్న పోలీసింగ్ విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజా భద్రతకు చేపడుతున్న చర్యలపై ఎస్పీ సుబ్బరాయుడు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. డ్రోన్ సాంకేతికతను నేర నియంత్రణ, జనసమ్మర్థ నిర్వహణ, ప్రత్యేక ఆపరేషన్లలో వినియోగిస్తున్న విధానాన్ని ఎస్పీ వివరించారు. అలాగే మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతి సబ్‌డివిజన్ పరిధిలో చేపడుతున్న డ్రగ్స్, గంజాయి నిరోధక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, డ్రగ్ టెస్టింగ్ చర్యలను వివరించారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌తో కలిసి నిర్వహించిన రహదారి భద్రత బస్సు యాత్ర, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, ప్రమాదాల నివారణ చర్యలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల వివరాలను కూడా డీజీపీకి ఎస్పీ వివరించారు. మహిళల భద్రత కోసం శక్తి టీమ్ ద్వారా చేపడుతున్న తక్షణ స్పందన, అవగాహన కార్యక్రమాలు, భద్రతా చర్యల గురించి వివరించారు.
జిల్లా పోలీసులకు ప్రశంసలు..
ఈ సందర్భంగా జిల్లాలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జరుగుతున్న పర్యవేక్షణ, సీసీ కెమెరాల వినియోగం, పటిష్ట నైట్ బీట్ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై డీజీపీ సమగ్రంగా సమీక్షించారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సైబర్, సోషల్ మీడియా మానిటరింగ్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని డీజీపీ ప్రశంసించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చేపడుతున్న ప్రత్యేక చర్యలు, సాంకేతిక ఆధారిత పోలీసింగ్, ప్రజా భద్రత, పోలీస్ సంక్షేమ కార్యక్రమాల అమలులో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పనితీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పోలీసు అధికారులకు సూచించారు.
