రైతులకు అందుబాటులో ఎరువులు: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
చిట్యాలలో ‘ఆకా సెంటర్’ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్ఆర్
నానో యూరియా, డీఏపీ, పొటాష్‌తో అధిక లాభాలు
పంటల మార్పిడితోనే నాణ్యమైన, అధిక దిగుబడులు
చిట్యాల, (ఆంధ్రప్రభ): ప్రస్తుత ఖరీఫ్ (వానకాలం) సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచేందుకే ప్రభుత్వం ‘ఆకా సెంటర్లను’ ప్రవేశపెట్టిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకా సెంటర్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు యూరియా బస్తాల పంపిణీని ఆయన మొదలుపెట్టారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వానకాలం సీజన్లో రైతులకు యూరియా బస్తాల కొరత రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులు సాంప్రదాయ పద్ధతులతో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేందుకు నానో యూరియా, డీఏపీ, పొటాష్ లిక్విడ్లను పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఒకే రకమైన పంటలు వేయకుండా, పంటల మార్పిడి విధానాన్ని అవలంబించడం ద్వారా భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.
రైతుల సంక్షేమం కోసం ప్రజాపాలన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకా సెంటర్ యజమాని గుమ్మడి సత్యనారాయణ, చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు ముకిరాల మధువంశీకృష్ణ, పులి తిరుపతిరెడ్డి, దొడ్డి కిష్టయ్య, చిలుకల రాయకోమురు, గంగాధరి రవీందర్, కట్కూరి నరేందర్, బుర్ర శ్రీనివాస్, అల్లకొండ కుమార్, దబ్బెట అనిల్, అల్లంరాజు, సర్పంచులు కొడారి అశోక్, నక్క భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
