అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సహాయం..
బాధిత మహిళకు రూ. 2 లక్షల సీఎం సహాయనిధి ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్, ఆంధ్రప్రభ: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ మహిళకు మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అండగా నిలిచారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌కు చెందిన ముదునూరి విజయదుర్గా అనే మహిళ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం అందించాల్సిందిగా గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డిని ఆశ్రయించారు.
బాధితురాలి పరిస్థితిపై మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి, విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. ప్రభుత్వం నుండి రూ. 2 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ ని మంజూరు చేయించారు.
శుక్రవారం రోజుఎమ్మెల్యే మల్లారెడ్డి తన చేతుల మీదుగా బాధితురాలి కుటుంబ సభ్యులకు ఈ ఎల్‌ఓసీని అందజేశారు. ఆపదలో ఉన్న తమకు తక్షణమే ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు బేరి బాల్ రాజ్, అమరం జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
