CM | వైరల్ ఏఐ వీడియోపై చంద్రబాబు సరదా స్పందన
CM | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘నువ్వు నాకు నచ్చావు’ లోని క్లైమాక్స్ సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఏఐ (కృత్రిమ మేధ) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి ఆర్నా, ఆమె తండ్రి రూపొందించిన ఈ వీడియోపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరదాగా స్పందిస్తూ, తన అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకోవడంతో అది మరింత చర్చనీయాంశంగా మారింది.
వీడియోలో చిన్నారి ఆర్నా విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతున్నట్లుగా ఏఐ సాయంతో రూపొందించారు. అదే సమయంలో ఆమె తండ్రి కనిపించడంతో, “బై సీబీఎన్ అంకుల్.. నేనిప్పుడు మీతో మాట్లాడలేను” అంటూ వీడియో కాల్‌ను ముగించి, ఆయన దగ్గరకు పరుగెత్తి వెళ్లి కాళ్లు పట్టుకునే సన్నివేశాన్ని ‘నువ్వు నాకు నచ్చావు’ చిత్రంలోని ప్రసిద్ధ క్లైమాక్స్‌కు అనుగుణంగా వినోదాత్మకంగా పునర్నిర్మించారు.
ఈ వీడియోను వీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నారి ఆర్నా హావభావాలు, అభినయాన్ని అభినందించారు. “ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండటం అసాధ్యం. నేను అధికారికంగా ఆర్నాకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను” అంటూ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి స్వయంగా ఈ వీడియోను పంచుకోవడంతో సోషల్ మీడియాలో దీనికి మరింత ఆదరణ లభిస్తోంది. వేలాది మంది నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ చిన్నారి ఆర్నా నటనను ప్రశంసిస్తుండగా, రీల్‌కు మిలియన్ల సంఖ్యలో వీక్షణలు, లైక్‌లు నమోదవుతున్నాయి.
