Drug Awareness Run | హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాపై అవగాహన
అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
బ్లాక్ గ్రౌండ్ నుంచి ఎంఆర్పీ చౌరస్తా వరకు సాగిన 2కే రన్
పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు, యువత
Drug Awareness Run |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్‌లో నిర్వహించిన 2కే అవగాహన రన్లో తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధంపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వికారాబాద్‌లోని స్థానిక బ్లాక్ గ్రౌండ్ నుంచి ఎంఆర్పీ చౌరస్తా వరకు నిర్వహించిన 2కే రన్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జెండా ఊపి ప్రారంభం పలికారు. అనంతరం ఆయన ర్యాలీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాజంలో ఈ సామాజిక రుగ్మతలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, మానవ అక్రమ రవాణా వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు పిలుపునిచ్చారు.

