కారును ఢీకొన్న కంటైనర్
- తృటిలో తప్పిన పెను ప్రమాదం
బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి–44పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటైనర్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న నలుగురు సీటుబెల్టులు ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది.

బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తున్న ఎంహెచ్–01 సీటీ–8497 నంబర్ గల కారును హెచ్ఆర్–47 జీ–5955 నంబర్ గల కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న సందీప్‌తో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు సీటుబెల్టులు ధరించి ఉండటంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదని ఎస్సై తెలిపారు.
బాధితుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే, హర్యానాకు చెందిన కంటైనర్ డ్రైవర్ రాంగూలబ్కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని ఎస్సై వెల్లడించారు.
