మొహర్రం సందర్భంగా కర్బలా అమరవీరులకు నివాళులు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మొహర్రం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో షియా ముస్లిం వర్గాల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ‘చెస్ట్ బీటింగ్’ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ముస్లిం సోదరులకు సంఘీభావం తెలిపారు. కర్బలా యుద్ధంలో అమరులైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ మరియు ఆయన అనుచరుల త్యాగాలను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మంత్రి, కర్బలా అమరవీరులకు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. మచిలీపట్నంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం మొహర్రం వేడుకల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు చెస్ట్ బీటింగ్ ద్వారా కర్బలా అమరవీరులకు రక్త తర్పణం అర్పిస్తూ, వారి త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు.

ఆంధ్రాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ మచిలీపట్నం మొహర్రం ప్రదర్శనలో ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించారు.