Nellore Rottela Panduga | నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ..

Nellore Rottela Panduga | ఐదు రోజుల పాటు మత సామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండుగ

14 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.. పటిష్ట ఏర్పాట్లు

ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి భారీగా భక్తుల రాక

నేడు సందల్‌షరీఫ్.. రేపు చారిత్రాత్మక గంధ మహోత్సవం

రాష్ట్ర పండుగగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం


Nellore Rottela Panduga| నెల్లూరు, ఆంధ్రప్రభ ప్రతినిధి: అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రొట్టెల పండుగ నేటి నుంచి నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాతో పాటు స్వర్ణాల చెరువు ప్రాంతంలో ఘనంగా ప్రారంభం కానుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ చారిత్రాత్మక వేడుకలు ఈ నెల 30వ తేదీ వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు.

రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది సుమారు 14 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

పండుగ ప్రారంభానికి ఒక రోజు ముందే బారాషహీద్ దర్గా ప్రాంగణం వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. అంగళ్లు, ఎగ్జిబిషన్లు, రంగుల రాట్నాలు, ప్రత్యేక దుకాణాలతో పండుగ వాతావరణం నెలకొంది. ముసాఫీర్‌ఖానాతో పాటు ప్రత్యేక షెల్టర్లలో యాత్రికులకు వసతి కల్పించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య ఆరోగ్యశాఖ, ప్రైవేటు ఆస్పత్రులు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తుండగా, పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ఐదు రోజుల కార్యక్రమాలు

శుక్రవారం సందల్‌షరీఫ్తో ప్రారంభమయ్యే పండుగలో, జూన్ 27న గంధ మహోత్సవం, జూన్ 28న ప్రధాన రొట్టెల పండుగ, జూన్ 29న తహలీల్ ఫాతెహా, జూన్ 30న ముగింపు సభ నిర్వహించనున్నారు.

27వ తేదీ రాత్రి నెల్లూరులోని చారిత్రాత్మక అమీనియా మసీదు నుంచి వివిధ సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన గంధాన్ని గుర్రాలపై ఊరేగింపుగా బారాషహీద్ దర్గా వరకు తీసుకువచ్చే చారిత్రాత్మక గంధ మహోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ వేడుకలో ఫకీర్ల కీర్తనలు, సాంప్రదాయ వాయిద్యాలు, బాణాసంచా ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి.

ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు

మంత్రి పొంగూరు నారాయణ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల, నెల్లూరు నగర కమిషనర్ వై. ఓ. నందన్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారు.