AP Primary Education | ఏపీ ప్రాథమిక విద్యకు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు..

AP Primary Education | ఏపీ ప్రాథమిక విద్యకు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు..

AP Primary Education | ప్రపంచ బ్యాంకును ఆకట్టుకున్న ఏపీ పునాది విద్యా కార్యక్రమాలు
జాదూయ్ పిటారాతో చిన్నారుల్లో ఆసక్తికర అభ్యాసం
ఐసీడీఎస్ – పాఠశాల విద్యాశాఖ సమన్వయానికి ప్రత్యేక ప్రశంసలు
నిపుణ్ భారత్, జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ చర్యలు

AP Primary Education | అమరావతి, ఆంధ్రప్రభ: ప్రాథమిక విద్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రపంచ బ్యాంకు నుంచి ప్రశంసలు లభించాయి. చిన్నారుల్లో అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాల పెంపునకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, నిరంతర అభ్యాసానికి రూపొందించిన వ్యవస్థ, ఆటల ఆధారిత బోధన, ఆధునిక విద్యా సాధనాల వినియోగం వంటి అంశాలను ప్రపంచ బ్యాంకు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మెచ్చుకుంది. దక్షిణాసియా విభాగ ఉపాధ్యక్షుడు జోహాన్స్ జుట్ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని మోడల్ ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి తరగతి గదుల్లో జరుగుతున్న బోధనను పరిశీలించింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో విద్యా నాణ్యత పెంపునకు తీసుకుంటున్న చర్యలను అధికారులు బృందానికి వివరించారు.

జాదూయ్ పిటారాతో ఆసక్తికర బోధన

పిల్లల్లో అభ్యాసంపై ఆసక్తి పెంచేందుకు వినియోగిస్తున్న జాదూయ్ పిటారా విద్యా సామగ్రిని ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించింది. కథలు, చిత్రాలు, బొమ్మలు, ఆటలు, గణిత కార్యకలాపాలు, సృజనాత్మక వ్యాయామాల ద్వారా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారని గుర్తించింది. ప్రతినిధి బృందం అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించింది. అక్కడ చిన్నారులకు నిర్వహిస్తున్న ఆటల ఆధారిత అభ్యాస కార్యక్రమాలు, పాఠశాలలో చేరే ముందు అవసరమైన భాషా, సామాజిక, మానసిక నైపుణ్యాలను పెంపొందించే విధానాన్ని పరిశీలించింది. పిల్లలు ఆనందంగా నేర్చుకునే వాతావరణాన్ని సృష్టించడం వల్ల పాఠశాలలో చేరిన తర్వాత అభ్యాసం సులభమవుతోందని అధికారులు వివరించారు. ఈ విధానం జాతీయ విద్యా విధానం-2020లో సూచించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఐసీడీఎస్ – పాఠశాల విద్యాశాఖ సమన్వయం

మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఐసీడీఎస్, పాఠశాల విద్యాశాఖ మధ్య ఏర్పాటైన సమన్వయాన్ని ప్రపంచ బ్యాంకు బృందం ప్రత్యేకంగా అభినందించింది. అంగన్వాడీ నుంచి ప్రాథమిక పాఠశాలకు మారే పిల్లల్లో అభ్యాసంలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్య కొనసాగేలా వ్యవస్థ రూపొందించడం మంచి ఫలితాలను ఇస్తోందని పేర్కొంది. ఈ సమన్వయం వల్ల చిన్నారులు మానసిక, భాషా, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతోందని అధికారులు వివరించారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు పిల్లలతో మమేకమై బోధిస్తున్న తీరు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ఆకట్టుకుంది. విద్యార్థుల వ్యక్తిగత లెర్నింగ్ పోర్ట్‌ఫోలియోలను కూడా ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించింది.

తల్లిదండ్రులతో ముఖాముఖి

పిల్లల తల్లిదండ్రులతో కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చదవడంపై ఆసక్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఇతరులతో కలిసిమెలసి ఉండే స్వభావం పెరిగిందని తల్లిదండ్రులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

ఎన్ఈపీ-2020, నిపుణ్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో అమలవుతున్న పునాది విద్యా కార్యక్రమాలు జాతీయ విద్యా విధానం-2020, నిపుణ్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి చిన్నారి మూడో తరగతి పూర్తయ్యే నాటికి చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించే లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ సమర్థంగా అమలు చేస్తోందని ప్రశంసించారు.