కారు ఢీకొని వ్యక్తి మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లి గోరి మండలం చెన్నాపూర్–దమ్మన్నపేట క్రాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడింది. అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నాపూర్ గ్రామానికి చెందిన ఒన్నాల మొగిలి (59) తన భార్య **సరోజన (55)**తో కలిసి తిరుమలగిరిలో అనారోగ్యంతో ఉన్న బంధువును పరామర్శించేందుకు టీవీఎస్ చాంప్ ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో దమ్మన్నపేట క్రాస్‌ వద్ద పరకాల నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న కారును పసిక ఆకాశ్ (24) అనే యువకుడు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ మొగిలి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో మొగిలి, సరోజన ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో పరకాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మొగిలి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సరోజనను మెరుగైన చికిత్స కోసం వినూత్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుడి కుమారుడు ఒన్నాల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రేగొండ ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు.