Amazon India Investment | పెట్టుబడులపై కీలక ప్రకటన
Amazon India Investment | పెట్టుబడులపై కీలక ప్రకటన
Amazon India Investment | మోదీతో ఆండీ జాస్సీ భేటీ..
ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాలకు అదనంగా 13 బిలియన్ డాలర్లు
2030 నాటికి 38 లక్షల ఉద్యోగాలు,
80 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం
హైదరాబాద్, ముంబై AWS డేటా సెంటర్ల విస్తరణతో భారత్‌కు మరింత ప్రాధాన్యం
Amazon India Investment | న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2026 నుంచి 2030 నాటికి భారత్‌లో మొత్తం 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గురువారం ప్రకటించింది. న్యూఢిల్లీలో అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
అంతకు ముందు అమెజాన్ గత ఏడాది చివరిలో భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. దీనికి అదనంగా మరో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెంచుతూ, మొత్తం 48 బిలియన్ డాలర్లకు పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రకటించింది.
ఆండీ జాస్సీతో సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని, భారత్‌లో అమెజాన్ రికార్డు స్థాయిలో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఇది మన యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తుందని, అదే సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తిని ఇది చూపిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఆండీ జాస్సీతో సమావేశం తర్వాత ప్రధాని ఈ పోస్టు చేశారు. అంతకు ముందు ఆండీ జాస్సీ అమెజాన్ భారత్‌లో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పోస్టు చేశారు. భారత్‌లో అమెజాన్ భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశాన్ని తాను నిజంగా ఆస్వాదించానని ఆయన పేర్కొన్నారు. తాము దశాబ్దానికి పైగా భారత్‌లో వినియోగదారులకు, విక్రేతలకు, డెవలపర్లకు, స్టార్టప్‌లకు, సంస్థలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ఇది ఇప్పుడే ప్రారంభమని, రానున్న ఐదేళ్లలో 48 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెడుతున్నామని, ఇందులో ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 21 బిలియన్ డాలర్లకు పైగా పెట్టనున్నట్లు ఆండీ జాస్సీ తన పోస్టులో తెలిపారు. 2030 నాటికి తాము 38 లక్షల ఉద్యోగాలకు మద్దతు ఇవ్వాలని, 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులు సాధ్యం చేయాలని, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు ఏఐ ప్రయోజనాలు అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
అమెజాన్ 2010 నుంచి భారత్‌లో ఇప్పటివరకు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందని, గత ఏడాది చివరిలో మరో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు 2026-2030 మధ్య పెట్టనున్నట్లు ప్రకటించామని, అయితే ఈ మొత్తాన్ని 35 బిలియన్ డాలర్ల నుంచి 48 బిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ఈ రోజు ప్రకటించామని ఆండీ జాస్సీ వివరించారు.
మోదీ – సీఈఓ ఆండీ జాస్సీ సమావేశం
ముందు ప్రకటించిన పెట్టుబడికి 13 బిలియన్ డాలర్లు అదనంగా కేటాయించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధిని వేగవంతం చేయడానికి అదనంగా 13 బిలియన్ డాలర్లను కేటాయిస్తూ సవరించిన అంచనాలను రూపొందించారు. దీంతో ఐదేళ్ల కాలంలో క్లౌడ్ మౌలిక సదుపాయాల కోసం మొత్తం 21 బిలియన్ డాలర్లకు పైగా చేరనుంది.
ఈ పెట్టుబడి ద్వారా ముంబై, హైదరాబాద్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ సామర్థ్యాలను విస్తరిస్తారు. తమ పెట్టుబడిలో గణనీయమైన భాగం మార్కెట్‌ప్లేస్ వ్యాపారంలో ఉందని, ఈ రోజు ప్రకటించిన 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి క్లౌడ్, ఏఐపై కేంద్రీకృతమైందని జాస్సీ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా భారత్ ఒక ముఖ్యమైన క్లౌడ్, ఏఐ కేంద్రంగా ఎదుగుతోందని, ఇక్కడ తమకు చాలా డిమాండ్ ఉన్నందున భారత్‌లో క్లౌడ్, ఏఐ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తామని తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా దీర్ఘకాలిక ఉపాధి, ఆర్థికాభివృద్ధి మరింత బలోపేతం అవుతుందని అమెజాన్ వివరించింది.
2024లో మద్దతు ఇస్తున్న 28 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల నుంచి 2030 నాటికి 38 లక్షల ఉద్యోగాలకు తమ ఉపాధి వ్యవస్థను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 2030 నాటికి నిర్దేశించిన అదనపు లక్ష్యాల్లో 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులు, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు ఏఐ ప్రయోజనాలు, 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ విద్య పరిచయం చేయడం వంటివి ఉన్నాయని అమెజాన్ వెల్లడించింది.
2020 నుంచి 2030 మధ్య కాలంలో భారత్‌లో అమెజాన్ మొత్తం పెట్టుబడులు 88 బిలియన్ డాలర్లకు పైగా ఉండనున్నాయి. ఈ పెట్టుబడులు ఈ-కామర్స్ నెట్‌వర్క్‌లు, క్విక్ కామర్స్ కార్యకలాపాలు, సాంకేతిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వినియోగించనున్నట్లు తెలిపింది.
