పెరుగుతున్న తిమింగలాల సంఖ్య !!
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తిమింగలాల సంఖ్య పెరిగిపోతోందట.. సముద్రంలో ఉండే తిమింగలాలు అంతరించిపోతున్నాయంటూ ప్రపంచం ఆందోళన చెందుతుంటే… మన దగ్గర మాత్రం కొత్త జాతి తిమింగలాలు పుట్టుకొస్తున్నాయి. కానీ మీరు అనుకునే తిమింగలాలు కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే అవినీతి తిమింగలాలు.
ప్రజల సొమ్మును, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు అక్రమంగా కూడబెట్టే అవినీతి తిమింగలాలు. ఒకవైపు సముద్రంలో తిమింగలాల సంఖ్య తగ్గిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతుంటే… కొందరు ప్రభుత్వ అధికారులు మాత్రం అక్రమ సంపాదనతో తామే తిమింగలాలుగా మారిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రోజుకో అధికారి అక్రమాస్తుల కేసులో చిక్కుతుండటం చూస్తుంటే, అవినీతి తిమింగలాల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాన్యుడు జీవితాంతం కష్టపడినా సంపాదించడం కష్టమే అన్నంత పెద్దమొత్తంలో ఆస్తులను కొందరు ప్రభుత్వ అధికారులు అక్రమ మార్గాల్లో కూడబెట్టిన ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి.
రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక సోదాల్లో కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. నగదు, బంగారం, విలాసవంతమైన భవనాలు, స్థలాలు, బ్యాంకు డిపాజిట్లు, బినామీ ఆస్తులు… ఇలా ఊహించని స్థాయిలో సంపదను కూడబెట్టిన అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు.
అక్రమాస్తుల కేసులో ఒక అధికారి పట్టుబడిన కొద్ది రోజులకే మరో అధికారి ఏసీబీ వలలో చిక్కడం పరిపాటిగా మారింది. దీంతో ఏసీబీ చురుగ్గా పనిచేస్తోందని సంతోషించాలా? లేక ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి లోతుగా పాతుకుపోయిందని ఆందోళన చెందాలా… అనే చర్చ ప్రజల్లో సాగుతోంది. అవినీతిపై ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొత్త కొత్త రూపాల్లో అక్రమ సంపాదన కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉన్న కొందరు అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ వెలుగులోకి వస్తున్న అక్రమాస్తుల కేసులు అవినీతి వ్యవస్థ ఎంత లోతుగా పాతుకుపోయిందనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
మరోవైపు, అవినీతి అధికారులను కేవలం సస్సెండ్ చేసి ఏసీబీ అధికారులు చేతులు దులుపుకుంటుంన్నారని నేటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి కేసుల్లో నిందిత అధికారులను సస్పెండ్ అయిన అధికారులు… కొంతకాలం తర్వాత తిరిగి విధుల్లోకి చేరి మళ్లీ అదే అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. సస్పెన్షన్ కొద్ది నెలల సెలవులాంటిదే, వ్యవస్థ మారకపోతే అవినీతి ఆగదు, తరతరాలకు సరిపడా సంపాదించిన తర్వాత సస్పెన్షన్‌తో ఏమి ప్రయోజనం… వంటి అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇవి ప్రజల నుంచి, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు మాత్రమే. చట్టపరమైన చర్యలు, శిక్షల నిర్ణయం దర్యాప్తు ఫలితాలు, న్యాయ ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. అందుకే అవినీతి ఆరోపణలు రుజువైన అధికారులపై మరింత కఠిన చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, త్వరితగతిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి అక్రమాస్తుల తిమింగలాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకు ఏపీ, తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తులు (DA) లేదా భారీ అవినీతి కేసుల్లో వెలుగులోకి వచ్చిన ప్రముఖ అధికారుల జాబితా….
తెలంగాణ..
- అర్రమాడ వెంకట్ రెడ్డి – హనుమకొండ అదనపు కలెక్టర్ (రెవెన్యూ). ఏసీబీ సోదాల్లో రూ.7.69 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించి కేసు నమోదు చేసింది.
- సుంకరి నరహరి రావు – డిప్యూటీ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్. హైదరాబాద్ సహా 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.30 కోట్లకు పైగా ఆస్తులు, భారీ నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు.
- కొమ్మూరి మల్లారెడ్డి – నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్. 11 ప్రాంతాల్లో దాడులు చేసి దాదాపు రూ.20 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు.
- టి. సుచరిత – శామీర్‌పేట తహశీల్దార్. లంచం కేసు అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల దర్యాప్తులో కోట్ల విలువైన భూములు, ఫ్లాట్లు, నగదు, బంగారం వెలుగులోకి వచ్చాయి.
- గుండేటి రాము – కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. రూ.87.44 లక్షల డాక్యుమెంట్ విలువ గల ఆస్తులు గుర్తించి DA కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
- ఎస్.కె. అబ్దుల్ ఆసిఫ్ – ప్రకాశం జిల్లా గనులు, భూగర్భ శాఖ సర్వేయర్-II. ఏసీబీ సోదాల్లో ఫ్లాట్లు, వ్యవసాయ భూమి, 620 గ్రాముల బంగారం, నగదు తదితర ఆస్తులు గుర్తించి DA కేసు నమోదు చేసింది.
- కాళింగిరి శాంతి – దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్. అక్రమాస్తుల కేసులో అరెస్టు అనంతరం బినామీ ఆస్తులపై ఏసీబీ విస్తృత విచారణ చేపట్టింది.
- పురం బాలాజీ – అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (శ్రీ సత్యసాయి జిల్లా). కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
- చింతకాయల అప్పారావు – విజయవాడ నార్త్ డిప్యూటీ తహశీల్దార్. ఇది లంచం (ట్రాప్) కేసు అయినప్పటికీ, అనంతరం ఆస్తులపై కూడా తనిఖీలు నిర్వహించారు.
అక్టోబర్ (2025) 1 నుంచి 2026 జూన్ 9 వరకు 192 కేసులు నమోదు అయినట్టు తెలంగాణ ఏసీబీ తెలిపింది. వీటిలో 12 ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసులు, 95 ట్రాప్ (లంచం) కేసులు ఉన్నాయి. ఈ కాలంలో తెలంగాణలో DA కేసులు ఎక్కువగా నమోదవగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలువురు అధికారులపై అక్రమాస్తుల కేసులు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది.
