విజిలెన్స్ తనిఖీల సమాచారం లీక్ ఆరోపణలు
- జుక్కల్ వ్యవసాయ అధికారిణి మహేశ్వరిపై సస్పెన్షన్ వేటు
జుక్కల్, ఆంధ్రప్రభ: జుక్కల్ వ్యవసాయ శాఖ అధికారిణి మహేశ్వరిపై సస్పెన్షన్ వేటు పడింది. గత నెలలో విజిలెన్స్ అధికారులు జుక్కల్ మండలంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.విజిలెన్స్ తనిఖీల్లో లక్షల రూపాయల విలువైన కాలం చెల్లిన ఎరువులు, పురుగుమందులు, అలాగే సరైన బిల్లులు లేని ఎరువులు గుర్తించినట్లు తెలిసింది. ఇదే సమయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తున్నారనే సమాచారాన్ని కొందరు ఎరువులు, విత్తనాల డీలర్లకు వ్యవసాయ అధికారిణి మహేశ్వరి ముందుగానే చేరవేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించినట్లు సమాచారం. విచారణ నివేదికను రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌కు పంపించగా, దాని ఆధారంగా మహేశ్వరిని సస్పెండ్ చేసినట్లు కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు.అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వ్యవసాయ అధికారిణి మహేశ్వరి సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని ఆయన వెల్లడించారు.జుక్కల్ వ్యవసాయ అధికారిణి సస్పెన్షన్ వ్యవహారం ప్రస్తుతం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
