పంట‌ల‌కు సాగునీరు

పంట‌ల‌కు సాగునీరు

గుంటుపల్లి ఎత్తిపోతల నుంచి విడుదల

(ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ ) : ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటిని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం విడుదల చేశారు. రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నారుమళ్లకు అవసరమైన నీటిని అందించేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. గుంటుపల్లి ఎత్తిపోతల పథకం పరిధిలోని సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టుకు ఈ నీటి విడుదలతో ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం వరి సాగు ప్రారంభ దశలో ఉండటంతో నారుమళ్ల పెంపకానికి నీటి కొరత లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సూచించారు.

రైతులు సకాలంలో సాగు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడేలా సాగునీటి వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. నీటి వినియోగంలో రైతులు సమన్వయంతో వ్యవహరించి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.