‘ఇందిరమ్మ’తో పేదల సొంతింటి కల సాకారం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మొగుళ్లపల్లి, జూన్ 25 (ఆంధ్రప్రభ): పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొడిమాల ప్రగతిరాణి–అనిల్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇల్లు లేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత గూడు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
