High Court | ప్రైవేటు కళాశాలలకు ఊరట..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవోపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఆ జీవో అమలుపై వచ్చే మంగళవారం వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని పలు కీలక ప్రశ్నలు అడిగింది. “ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోతే కళాశాలలు ఎలా నిర్వహిస్తారు? ప్రభుత్వం బకాయిలు విడుదల చేయదు.. మరోవైపు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవడానికి కూడా అనుమతించదు. అలాంటప్పుడు విద్యాసంస్థలు ఎలా కొనసాగుతాయి?” అని న్యాయస్థానం ప్రశ్నించింది.

అదేవిధంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం ఎంత మేర బడ్జెట్ కేటాయించిందని, ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఎందుకు విడుదల చేయలేదని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ అంశంపై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ, అప్పటి వరకు ప్రభుత్వ జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.