july2 | భూ పోరాటాన్ని విజయవంతం చేయాలి
పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత జులై 2న నిర్వహించనున్న భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ స్థానికత అంశంలో మళ్లీ కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగానే పరిగణించాలని న్యాయస్థానం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అయినప్పటికీ స్థానికుల హక్కులను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని, రాష్ట్ర యువత హక్కులను కాపాడటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని కవిత స్పష్టం చేశారు. స్థానికుల హక్కుల పరిరక్షణే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు.
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తన సత్తా చాటుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు అన్యాయం జరుగుతోందని, వారి సాధికారత కోసం మరింత కృషి అవసరమని పేర్కొన్నారు. జులై 2న జరిగే భూ పోరాటం తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కీలక ఘట్టంగా నిలుస్తుందని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కవిత విజ్ఞప్తి చేశారు.
