revealed | వీడిన మిస్టరీ…
ఆస్తి కోసం పక్కా ప్రణాళికతో…
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో ఇటీవల సంచలనం సృష్టించిన నలుగురి హత్య కేసులో మిస్టరీ వీడింది. మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్ (20), కుమార్తె అక్సర (11) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం పక్కా ప్రణాళికతో సుపారీ గ్యాంగ్ ద్వారా ఈ హత్యలు చేయించినట్లు దర్యాప్తులో తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం.. హసీనాకు గతంలో రెండు వివాహాలు జరగగా, అనంతరం మహమ్మద్ సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకుంది. సుల్తాన్‌కు కూడా గతంలో రెండు వివాహాలు జరిగాయి. ప్రస్తుతం సుల్తాన్ తన పిల్లలు ముజమిల్, అక్సరతో కలిసి నల్లగొండలో నివసిస్తున్నాడు.
హసీనా పేరిట సుమారు రూ. కోటి విలువైన స్థలాలు, ఇళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఆస్తులను తన మూడో భర్త సుల్తాన్ పిల్లల పేరుపై వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో, ఆమె మొదటి భర్త కూతురు, అల్లుడు కక్ష పెంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీషీటర్లతో సుపారీ ఇచ్చి హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలో సుల్తాన్ శరీరంపై ఆరు కత్తిపోట్లు, హసీనాపై ఏడు, చిన్నారి అక్సరపై తొమ్మిది, ముజమిల్‌పై ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. హత్యల క్రూరత్వం చూసి పోలీసులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఆర్థిక లావాదేవీలు, కుట్రకు సంబంధించిన ఇతర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
