గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించిన మంత్రి సీతక్క
గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించిన మంత్రి సీతక్క
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపూర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పరిశీలించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో పరిశుభ్రత, భోజన నాణ్యత, మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు నాణ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించిన మంత్రి, అనంతరం విద్యార్థులతో మమేకమై వారి అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుని ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పిరంగి, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
