APL-2026 | రాయలసీమ రాయల్స్‌పై విశాఖ లయన్స్ ఉత్కంఠ విజయం

రిష్కీ భుయి విధ్వంసక సెంచరీతో 190 పరుగుల భారీ స్కోరు
చివరి వరకు పోరాడిన రాయలసీమకు విజయం అందని ద్రాక్ష
ఏపీఎల్-2026లో అభిమానులను ఉర్రూతలూగించిన హోరాహోరీ పోరు

APL-2026 |ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026లో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానం మరో ఉత్కంఠభరిత పోరుకు వేదికైంది. లీగ్ దశలో జరిగిన 21వ మ్యాచ్‌లో సింహాద్రి విజాగ్ లయన్స్ జట్టు కేవలం నాలుగు పరుగుల తేడాతో రాయలసీమ రాయల్స్‌ను ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడగా, ఒత్తిడిని తట్టుకుని ఆడిన లయన్స్ జట్టు కీలక సమయంలో పైచేయి సాధించింది.

భారీ స్కోర్ దిశగా సింహాద్రి వైజాగ్..

టాస్ గెలిచిన రాయలసీమ రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన సింహాద్రి విజాగ్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టు ఇన్నింగ్స్‌కు కెప్టెన్ రిష్కీ భుయి వెన్నెముకలా నిలిచాడు. కేవలం 57 బంతుల్లోనే అజేయంగా 111 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. భుయికి తోడుగా ఎం. ధనుష్ 12 బంతుల్లో 26 పరుగులు చేయగా, బి. వినయ్ కుమార్ 17 పరుగులు, కె. మహీప్ కుమార్ 16 పరుగులతో విలువైన సహకారం అందించారు.

లయన్స్ ఇన్నింగ్స్‌లో మూడో వికెట్‌కు రిష్కీ భుయి, మహీప్ కుమార్ జోడీ 67 పరుగులు జోడించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. అనంతరం వినయ్ కుమార్‌తో కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పి స్కోరు వేగాన్ని పెంచాడు. చివరి ఓవర్లలో ధనుష్‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లయన్స్ స్కోరు 190 పరుగులకు చేరింది. రాయలసీమ రాయల్స్ బౌలర్లలో వై. వాసు రెండు వికెట్లు తీసి ఆకట్టుకోగా, కె. విజయ్ కుమార్, కె. సుధర్షన్, జి. పార్థసారధి తలో వికెట్ సాధించారు. అయితే భుయి విధ్వంసక బ్యాటింగ్ ముందు బౌలర్లు పూర్తిగా నిరుపాయంగా మారారు.

4 పరుగుల తేడాతో ఓటమి..

191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ రాయల్స్ పోరాటపటిమ కనబరిచినా లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సింహాద్రి విజాగ్ లయన్స్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు సాధించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. దీంతో ఏపీఎల్-2026లో మరో ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకున్న లయన్స్ జట్టు పాయింట్ల పట్టికలో కీలక అడుగు వేసింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రిష్కీ భుయి ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన సెంచరీ ఇన్నింగ్స్, చివరి వరకు సాగిన ఉత్కంఠ అభిమానులకు క్రికెట్ అసలు మజాను పంచాయి. మంగళగిరి మైదానం హోరాహోరీ పోరుకు వేదికగా మారగా, ప్రేక్షకులు ప్రతి బంతిని ఉత్కంఠగా ఆస్వాదించారు.