చింతల సుభద్రమ్మ మృతితో తీరని లోటు: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ స్వర్గీయ చింతల కృష్ణారెడ్డి సతీమణి చింతల సుభద్రమ్మ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. చౌటుప్పల్ పట్టణంలోని వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, సుభద్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కుమారుడు, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ వార్డు సభ్యుడు చింతల వెంకట్‌రెడ్డి (రాజు)తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు దశాబ్దాలకు పైగా చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా స్వర్గీయ చింతల కృష్ణారెడ్డి నీతి, నిజాయితీలతో ప్రజాసేవ చేశారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి చౌటుప్పల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మంచి పేరు, గౌరవం ఉందన్నారు. చింతల సుభద్రమ్మ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బు రాజు గౌడ్, ఉబ్బు వెంకటయ్య, మొగుదాల పావని రమేష్ గౌడ్, బాలు మహేందర్, ఆకుల ఇంద్రసేనారెడ్డి, కొసనం రాకేష్ రెడ్డి, నల్ల నరేందర్ రెడ్డి, చింతల రవీందర్ రెడ్డి, జానీ బాబు తదితరులు పాల్గొన్నారు.