Grade-1 | వేలాది రైల్వే పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Grade-1 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇప్పటికే సంక్షిప్త ప్రకటన విడుదల కాగా, పూర్తి నోటిఫికేషన్‌ను జూన్ 29న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ నియామకాల్లో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్‌కు 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3 విభాగంలో 6,242 పోస్టులు ఉన్నాయి. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ జూన్ 30 నుంచి ప్రారంభమై జూలై 29 వరకు కొనసాగనుంది. టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి. గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు ఇంజినీరింగ్, డిప్లొమా లేదా బీఎస్సీ అర్హతలను నిర్ణయించారు.

అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి రైల్వే నిబంధనల ప్రకారం వేతనాలు, ఇతర ప్రయోజనాలు అందించనున్నారు. రైల్వేలో స్థిరమైన ఉద్యోగం సాధించాలని భావిస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి అర్హతలు, పోస్టుల విభజన, దరఖాస్తు విధానం వంటి వివరాలు పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అందుబాటులోకి రానున్నాయి.