17 ఏళ్ల తర్వాత చంద్రసాగర్ నుంచి సాగునీటి విడుదల

  • రైతుల కోసం నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని ప్రముఖ సాగునీటి ప్రాజెక్టు చెరువు చంద్రసాగర్ నుంచి రైతులకు సాగునీరు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బుధవారం నీటిని విడుదల చేశారు.చంద్రసాగర్ నుంచి చివరిసారిగా 2009లో నీటిని విడుదల చేయగా, దాదాపు 17 ఏళ్ల అనంతరం 2026లో కురిసిన భారీ వర్షాలతో చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో మళ్లీ నీటిని విడుదల చేయడం విశేషంగా నిలిచింది.

ఈ నీటి విడుదల ద్వారా సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు.

చంద్రసాగర్ నిండడంతో పరిసర ప్రాంత రైతుల్లో ఆనందం నెలకొందని, సాగునీటి సమస్యకు పరిష్కారం లభించడం వల్ల పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.