గిరిజనుల ఉపాధిని అడ్డుకునే ప్రయత్నాలను సహించం

  • తెలంగాణ రక్షణ సమితికి గిరిజన సొసైటీ హెచ్చరిక

మంగపేట, ఆంధ్రప్రభ: గిరిజనుల ఉపాధిని అడ్డుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడెం గ్రామం పెసా మొబిలైజర్ మడి శోభన్ బాబు తెలంగాణ రక్షణ సమితి నాయకులను హెచ్చరించారు.మంగపేట మండలంలోని వాడగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పాలాయిగూడెంలో వాడగూడెం నల్లపోచమ్మ ఇసుక సొసైటీ సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మడి శోభన్ బాబు మాట్లాడుతూ, అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఇంకా అహంకారం తగ్గినట్లు కనిపించడం లేదని విమర్శించారు.

ఒక గిరిజన మహిళా మంత్రి అయిన సీతక్కను కూడా ఓర్వలేక ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని, గిరిజనులకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కల్పించే కార్యక్రమాలను కూడా రాజకీయ కోణంలో చూడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజన మంత్రి సీతక్క గిరిజనుల అభివృద్ధిని కోరుకోవడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. వాడగూడెం ఇసుక క్వారీ వద్ద జరిగిన ఘటనను వక్రీకరిస్తూ, అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి సీతక్క అనుచరులు కొట్టారని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఇసుక క్వారీలను నిర్వహిస్తున్న గిరిజన సొసైటీలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఇసుక క్వారీల వద్ద తాము సొసైటీ సభ్యులుగా, గిరిజన కుటుంబాల జీవనోపాధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు. అలాంటప్పుడు ప్రతి విషయాన్నీ రాజకీయాలకు ముడిపెట్టి, మంత్రి అనుచరులుగా ముద్ర వేయడం పూర్తిగా అవాస్తవమని, ఇలాంటి చవకబారు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజన సొసైటీలపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వేలాది గిరిజన కుటుంబాల ఉపాధికి ఆధారమైన ఇసుక క్వారీలను వివాదాల్లోకి లాగి వారి జీవనోపాధిని దెబ్బతీయాలని చూడటం తగదన్నారు.

గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చిన ఇసుక అనుమతుల జోలికి వస్తే సహించేది లేదని, గిరిజనుల ఉపాధిపై దాడులు చేస్తూ రాజకీయాలు చేయాలని చూస్తే గిరిజన సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.తెలంగాణ రక్షణ సమితికి కవిత తన తండ్రి పాలనలో ఇసుక సరఫరా చేసి ఇప్పటికీ బిల్లులు అందని గిరిజన సొసైటీలకు న్యాయం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నల్లపోచమ్మ ఇసుక సొసైటీ సభ్యులు, పలు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.