ఇండోర్‌లో గోల్డ్.. ఇప్పుడు ఇటలీ లక్ష్యం

  • జాతీయ కిక్‌బాక్సింగ్ పోటీల్లో బోయినపల్లి శ్రీనిక సత్తా

చిట్యాల, ఆంధ్రప్రభ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ నెల 17 నుంచి 21 వరకు జరిగిన జాతీయ స్థాయి కిక్‌బాక్సింగ్–2026 పోటీల్లో చిట్యాలకు చెందిన బోయినపల్లి శ్రీనిక ప్రతిభ కనబర్చి 18 కిలోల వెయిట్ కేటగిరీలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా ఇటలీలో జరగనున్న అంతర్జాతీయ కిక్‌బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించింది. హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో 4వ తరగతి చదువుతున్న శ్రీనిక, కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని విజయం సాధించింది.

చిన్న వయస్సు నుంచే కిక్‌బాక్సింగ్‌పై ఆసక్తి పెంచుకున్న శ్రీనిక, తన కోచ్ ఎన్. సంతోష్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతోంది. ఈ పోటీల్లో విజయం సాధించిన సందర్భంగా తల్లిదండ్రులు బోయినపల్లి కవిత–శ్రీనివాస్‌తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. శ్రీనిక ప్రతిభకు గుర్తింపుగా ఇటలీలో జరిగే అంతర్జాతీయ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. రాబోయే పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశానికి పతకం సాధించాలని పలువురు ఆకాంక్షించారు. ఇటలీలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి మరిన్ని విజయాలు, పతకాలు తీసుకురావాలని ప్రముఖులు ఆకాంక్షించారు.