విత్తనాలు కొన్న రైతులు రసీదులు పొందాలి..

జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి సురేఖ

జన్నారం, ఆంధ్రప్రభ : డీలర్ల నుంచి విత్తనాలు ఎరువులు కొన్న రైతులు రసీదులు పొందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సురేఖ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్, ఇందనపల్లి, రేండ్లగూడ, మురిమడుగు గ్రామాలలోని ఎరువులు విత్తన షాపులను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని పొనకల్ రైతు వేదికలో విత్తన మేళాను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రస్తుతం రైతుల కోసం నానో యూరియా అందుబాటులో ఉందన్నారు. నానో డీఏపీ ఉందని ఆమె చెప్పారు.

ప్రస్తుత వర్షాబావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పప్పు దినుసులు, నూనె పంటలైన ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, పంట మార్పిడి తప్పకుండా చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వం సిఫారసు చేసిన 7 రకాల వరి విత్తనాలను జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉంచామని, రైతులు అవే సన్న రకం వరి విత్తనాలను సాగు చేసి ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్ లభిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సింగరాయిపేట, కలమడుగు, చింతగూడ వ్యవసాయ విస్తరణ అధికార్లు సయ్యద్ అక్రముల్ల, కోడిమ్యాల దివ్య, కాండ్రపు లవన్, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.