సామాన్యులపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం
- సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి
తొర్రూరు, జూన్ 24 (ఆంధ్రప్రభ): కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిందని సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి విమర్శించారు.
బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయసారథి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడలేదన్నారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, కేంద్రంలో తన బలాన్ని పెంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర పార్టీలను బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. హైవే రోడ్లలో నడిచే వాహనాలపై భారం వేస్తున్నారని, పన్నుల రూపంతో పాటు రోడ్లపై దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అన్నారు. మతం, కులం, దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడం సరికాదన్నారు. మానుకోట జిల్లా కేంద్రంలో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జూలై 5, 6, 7 తేదీలలో తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే భూషణ్నేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు హాజరవుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు, జిల్లా నాయకులు ఓమ్ బిక్షపతి, మండల కార్యదర్శి బందు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
