Stock markets | 790 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

24 వేల మార్క్ దాటిన నిఫ్టీ
మదుపర్ల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్ల సంపద జమ

Stock markets | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉత్సాహంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, వడ్డీ రేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చన్న ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యలు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు మార్కెట్లకు బలాన్నిచ్చాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించడంతో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 76,229.76 పాయింట్ల వద్ద ప్రారంభమై రోజంతా సానుకూల ధోరణిలో ట్రేడైంది. ఒక దశలో 77,190.37 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ, చివరకు 790.54 పాయింట్లు లేదా 1.04 శాతం లాభంతో 76,991.22 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా బలమైన ప్రదర్శన కనబరిచింది. 197.55 పాయింట్లు ఎగిసి 24,021.65 వద్ద స్థిరపడింది. దీంతో నిఫ్టీ మరోసారి 24 వేల మార్క్‌ను అధిగమించింది. మార్కెట్లలో నమోదైన ఈ ర్యాలీతో మదుపర్ల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర పెరిగినట్లు అంచనా.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. వడ్డీ రేట్లపై ఒత్తిడి తగ్గే అవకాశాలపై ఆర్‌బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్లకు ఊతమిచ్చాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఇండిగో, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఎన్టీపీసీ, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, బీఈఎల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.65 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 4,060 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా అంతర్జాతీయ పరిణామాలు, వడ్డీ రేట్లపై సానుకూల అంచనాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కారణంగా మార్కెట్లు బలంగా పుంజుకున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.