వేతన సవరణ ప్రకటించాలి: పీఆర్టీయూ

జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం పీఆర్టీయూ టీఎస్ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాసరావు పాల్గొని ఉపాధ్యాయులకు సభ్యత్వ నమోదు చేయించి రసీదులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు జూలై 2023 నుంచి రావలసిన వేతన సవరణను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 31 నాటికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా తీసుకొని వర్క్ అడ్జస్ట్‌మెంట్ నిర్వహించాలని అన్నారు.సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయించాలని, సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతన శ్రేణి ప్రకటించాలని, హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు.

అలాగే కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయినులకు వారాంతపు సెలవును సంవత్సరంలో వినియోగించుకునే అవకాశం కల్పించాలని, పాఠశాలల ప్రారంభ సమయాన్ని ఉదయం 9:30 గంటలకు నిర్ణయించాలని, గత సంవత్సరంలో జరిగిన వర్క్ అడ్జస్ట్‌మెంట్‌ను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకుడు ఆడె ప్రకాష్, జిల్లా, మండల సంఘ నాయకులు తులసీరాం, రవీందర్, శ్రీకాంత్ జాదవ్, ఏనుగు భూమన్న, పత్తిపాక శ్రవణ్ కుమార్, ఆడె జంగు, మోహన్, వినోద్, సంతోష్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.