టిడిపి బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి..

ఓటర్ నమోదులో జాగ్రత్తలు వహించాలి..
టిడిపి జిల్లా సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు కార్యకర్తలే టిడిపి పార్టీకి బలమని పార్టీ బలోపేతానికి గ్రామ గ్రామాన కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం టిడిపి పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియ (ఎస్ఐఆర్) పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం, ఇప్పటికే ఉన్న ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓ) అందించే ఫామ్‌లను నింపేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు వహించాలని, తద్వారా దరఖాస్తులు తిరస్కరణకు గురికాకుండా చూడాలని కార్యకర్తలకు స్పష్టం చేశారు.

పార్టీ అధిష్టానం జారీ చేసే ప్రతి ఆదేశాన్ని, కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా అమలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి ఐక్యతతో కృషి చేయాలని కోరారు.సమావేశంలో జిల్లా స్థాయి నాయకులు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.