BearAlert | రైతుల్లో భయాందోళన
BearAlert | రైతుల్లో భయాందోళన
BearAlert | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం ఎస్‌ఎస్ గుండ్లు గ్రామంలో పట్టపగలే ఎలుగుబంట్లు సంచరించడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. గ్రామ శివార్లలోని పంట పొలాల్లోకి చొరబడిన ఎలుగుబంట్లు పంటలను ధ్వంసం చేస్తూ హల్‌చల్ చేశాయి.
స్థానికుల కథనం ప్రకారం, ఇటీవల కొద్ది రోజులుగా ఎలుగుబంట్లు తరచూ గ్రామ సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి వస్తున్నాయి. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పంటలను నాశనం చేయడంతో రైతులకు ఆర్థిక నష్టం కూడా వాటిల్లుతోంది.
మంగళవారం పట్టపగలు పొలాల్లో సంచరిస్తున్న ఎలుగుబంట్లను గమనించిన గొర్రెల కాపరులు, గ్రామస్తులు పెద్దఎత్తున కేకలు వేస్తూ వాటిని కొండల వైపు తరిమికొట్టారు. దీంతో కొంతసేపు గ్రామ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అటవీ ప్రాంతాల నుంచి తరచూ అడవి జంతువులు జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్ల సంచారంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంట్ల సంచారాన్ని నియంత్రించాలని, గ్రామస్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
