AI Education Telangana | ‘తొలిమెట్టు’కు టెక్నాలజీ జోడింపు

3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఏఐ పాఠాలు..
వారానికి 80 నిమిషాల బోధన
వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తింపు

AI Education Telangana | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరచేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని 2026-27 విద్యా సంవత్సరంలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. బోధనా ప్రమాణాల పెంపు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) లక్ష్యాల సాధనతో పాటు ఆధునిక సాంకేతికతను విద్యలో భాగం చేస్తూ పలు కీలక చర్యలను విద్యాశాఖ ఉత్తర్వుల ద్వారా ప్రకటించింది.

విద్యార్థులకు ఏఐ పాఠాలు
నూతన విద్యా విధానంలో భాగంగా 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వారానికి 80 నిమిషాల పాటు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత బోధన అందించనున్నారు. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించడంతో పాటు అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా విద్యాశాఖ పేర్కొంది.

గణితం, భాషల అభ్యాసానికి ఏఐ టూల్స్
గణితం, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏఐ ఆధారిత వ్యక్తిగత అభ్యాసన సాధనాలను విస్తృతంగా వినియోగించనున్నారు. ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని గుర్తించి వారికి అనుగుణంగా బోధన అందించే విధానాన్ని అమలు చేయనున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తింపు
ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో కూడా అమలు చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ప్రాథమిక విద్యా ప్రమాణాలు అమలులోకి రానున్నాయి.

ఏడాదికి మూడుసార్లు మూల్యాంకన పరీక్షలు
విద్యార్థుల అభ్యాస పురోగతిని అంచనా వేయడానికి ఏడాదికి మూడు సార్లు మూల్యాంకన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక రెమెడియల్ తరగతులు నిర్వహించి అభ్యాస లోటును పూడ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.

జాతీయ స్థాయిలో తెలంగాణకు మెరుగైన స్థానం
ప్రాథమిక విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాల సమర్థ అమలు కారణంగా జాతీయ స్థాయి విద్యా సర్వేల్లో తెలంగాణ ర్యాంకు గణనీయంగా మెరుగుపడినట్లు విద్యాశాఖ తెలిపింది. గతంలో 36వ స్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం 26వ స్థానానికి చేరుకోవడం విద్యా రంగంలో సాధించిన పురోగతికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.