కాంగ్రెస్ హయాంలోనే వార్డు సమస్యలకు పరిష్కారం: పోరండ్ల సంతోష్ కుమార్

కాంగ్రెస్ హయాంలోనే వార్డు సమస్యలకు పరిష్కారం: పోరండ్ల సంతోష్ కుమార్

పరకాల, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పరకాల పురపాలక సంఘం మూడో వార్డు మాజీ కౌన్సిలర్ పోరండ్ల సంతోష్ కుమార్ అన్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడో వార్డులోని రోడ్లు, డ్రైనేజీ సమస్యలను అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపించారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకెళ్లగా పురపాలక సంఘం టఫ్‌ఐడీసీ (TUFIDC) నిధులు కేటాయించి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని పూర్తి చేసిందన్నారు.

ఈ సందర్భంగా మూడో వార్డు ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి సంతోష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.