Telangana Voter List | లక్షకు పైగా మ్యాపింగ్ కాని ఓట్లపై ఆందోళన

Telangana Voter List | లక్షకు పైగా మ్యాపింగ్ కాని ఓట్లపై ఆందోళన

Telangana Voter List | ఓటర్ల ధ్రువీకరణలో బీఎల్వోల అవస్థలు
చిరునామాల్లో కనిపించని ఓటర్లతో పెరిగిన సవాళ్లు
గౌరవ వేతనం లేక అదనపు బాధ్యతల భారం
బీఎల్వోల సమస్యల పరిష్కారానికి చర్యల హామీ

Telangana Voter List | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ బూత్ స్థాయి అధికారులకు గుదిబండలా మారింది. ఓటర్ల ధ్రువీకరణ, మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సిన బాధ్యతలు అప్పగించినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో చిరునామాల్లో కనిపించని ఓటర్ల కారణంగా బీఎల్వోలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో ఇళ్లను సందర్శించాలని అధికారులు నిర్దేశించిన లక్ష్యాలతో ఒత్తిడికి లోనవుతున్నారు.

ముఖ్యంగా పట్టణ నియోజకవర్గాల్లో నమోదైన చిరునామాల్లో చాలా మంది ఓటర్లు నివసించడం లేదని బీఎల్వోలు చెబుతున్నారు. ఉద్యోగాలు, విద్య, ఇతర కారణాలతో నివాసం మారిన వారు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. కొందరు సంవత్సరాల క్రితమే వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినా, ఓటరు జాబితాలో పాత చిరునామాలే కొనసాగుతున్నాయని అధికారులు గుర్తిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఓటరును వెతికి పట్టుకుని ఎన్యుమరేషన్ ఫారం అందించడం, వివరాలను సేకరించడం బీఎల్వీలకు సవాల్‌గా మారుతోంది. ఒకే ఇంటి కోసం ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే వేగవంతం చేయాలనే ఉద్దేశంతో రోజుకు సుమారు 300 ఇళ్లను సందర్శించాలని క్షేత్రస్థాయి అధికారులకు లక్ష్యాలు నిర్దేశించగా, ఇది ఆచరణలో సాధ్యం కావట్లేదని బీఎల్వోలు పేర్కొంటున్నారు. ఫారాలు అందించడం, వివరాలు నమోదు చేయడం వంటి ప్రక్రియకు సమయం అవసరమవుతుందని వారు అంటున్నారు.

చాలామంది బీఎల్వోలు ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో తమ సాధారణ విధులతో పాటు ఈ అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోందని, దీనివల్ల తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొంటున్నారు.

లక్షకు పైగా మ్యాపింగ్ కాని ఓట్లు

రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. 10కి పైగా నియోజకవర్గాల్లో లక్షకు పైగా ఓట్లు ఇప్పటికీ మ్యాపింగ్‌కు నోచుకోలేదు. మరో ఎనిమిది నియోజకవర్గాల్లో 90 వేలకుపైగా ఓట్లు ఇంకా ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నిర్దేశించిన గడువులోగా ప్రక్రియ పూర్తి చేయడం సవాల్‌గా మారనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరిగా పనులు నిర్వహించడం కష్టమని, ప్రతి బీఎల్వోకు కనీసం ఒక సహాయకుడిని నియమించాలని వారు కోరుతున్నారు.

గౌరవ వేతనం లేకుండానే అదనపు బాధ్యతలు

ఓటర్ల సర్వే వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ తమకు తగిన గౌరవ వేతనం లేదా ప్రత్యేక భత్యం ఇవ్వడం లేదని బీఎల్వోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో రోజంతా క్షేత్రస్థాయిలో తిరగాల్సి వస్తున్నా, ప్రయాణ ఖర్చులు, ఇతర వ్యయాల భారం తమపైనే పడుతోందని పేర్కొంటున్నారు.

ప్రభుత్వం, ఎన్నికల సంఘం తమ సమస్యలను గుర్తించి అదనపు సిబ్బంది, తగిన భత్యాలు, పని లక్ష్యాల్లో సడలింపులు కల్పించాలని వారు కోరుతున్నారు. లేకపోతే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ నోడల్ ఆఫీసర్ చెన్నయ్య మాట్లాడుతూ, బీఎల్వోల ఇబ్బందుల పరిష్కారానికి సీఈఓ చర్యలు చేపడుతున్నారని చెప్పారు.