రక్తదానంలో కర్నూలు జీజీహెచ్‌కు జాతీయ గౌరవం

ఎన్‌బీటీసీ జాతీయ అవార్డు అందుకున్న రక్తకేంద్రం.. రాష్ట్రంలో ప్రథమ స్థానం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: రక్త మార్పిడి సేవల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) రక్తకేంద్రం జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందింది. జాతీయ రక్త మార్పిడి మండలి (ఎన్‌బీటీసీ) ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 16న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమంలో కర్నూలు జీజీహెచ్ రక్తకేంద్రానికి ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును ప్రదానం చేశారు.

రక్త మార్పిడి సేవల్లో అత్యుత్తమ పనితీరు, స్వచ్ఛంద రక్తదానాల ప్రోత్సాహం, రక్త నిల్వల నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం విశేషం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అత్యధికంగా 42 స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహించడంతో పాటు 13,546 యూనిట్ల స్వచ్ఛంద రక్తాన్ని సేకరించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఈ పురస్కారం లభించింది.

రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో రక్తం అందించేందుకు చేపట్టిన చర్యలు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం, యువతను రక్తదానానికి ప్రోత్సహించడం వంటి అంశాల్లో కర్నూలు రక్తకేంద్రం ఆదర్శంగా నిలిచిందని ఎన్‌బీటీసీ ప్రతినిధులు ప్రశంసించారు.

ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం ఆసుపత్రికి గర్వకారణమన్నారు. రక్తకేంద్ర వైద్యులు, సిబ్బంది, స్వచ్ఛంద రక్తదాతలు, సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహత్తర సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

రక్తదానాన్ని ఉద్యమంలా నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్తాన్ని అందించడమే లక్ష్యమని వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఆదర్శంగా నిలవాలని సంకల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి, విభాగాధిపతి డా. జి. బాలేశ్వరి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎస్. సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. షేక్ షహానాజ్, డా. సి. రవికాంత్, కౌన్సిలర్ కిరణ్, ల్యాబ్ టెక్నీషియన్ జగదీశ్వర్ రెడ్డి, స్టాఫ్ నర్సులు గేరా సుజాత, ఇందిరా విశ్వాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరాల నిర్వహణ, స్వచ్ఛంద రక్త సేకరణలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కర్నూలు జీజీహెచ్ రక్తకేంద్రం జిల్లా వైద్యరంగానికి గర్వకారణంగా నిలిచింది.