ఎలినినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి

  • విత్తన మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే,
  • దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వారం రోజుల విత్తన మేళా కార్యక్రమాన్ని మంగళవారం నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యశారద కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఎలినినో ప్రభావంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండి తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి ధాన్యాలకే క్వింటాలుకు రూ.500 బోనస్ వర్తిస్తుందని తెలిపారు. రైతులు ప్రభుత్వ సూచించిన విత్తన రకాలనే సాగు చేయాలని కోరారు. అలాగే వ్యవసాయంలో యూరియా వినియోగాన్ని తగ్గించి, వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మేరకే ఎరువులను వినియోగించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ పంటల సాగులో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ఏడీఏ శ్రీనివాసు, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు దేవేందర్‌రావు, రాష్ట్ర నాయకులు పులి అనిల్‌కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పార్వతమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు కిరణ్, స్థానిక సర్పంచ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.