Food Safety Alert | డబ్బులు ఇచ్చి మరీ రోగాలను కొంటున్నామా?

Food Safety Alert | డబ్బులు ఇచ్చి మరీ రోగాలను కొంటున్నామా?

Food Safety Alert | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో వికెండ్స్‌లో, సరదాగానో కుటుంబంతో కలిసి బయట భోజనం చేద్దామని చాలా మంది అనుకుంటారు. “ఏ రెస్టరెంట్‌కు వెళ్దాం?” అని ఫోన్ ఓపెన్ చేసి, మనకు అందుబాటులో ఉన్న హోటళ్ల కోసం వెతికితే.. “నాటుకోడి చిల్లుగారే”, “తినడానికి రా”, “రా తినిపో” అంటూ రకరకాల వింతైన, ఆకర్షణీయమైన పేర్లతో రెస్టరెంట్లు కనిపిస్తాయి. వాళ్లు పిలుస్తున్నారు కదా అని, ఆ పేర్లను చూసి మనం ఆ రెస్టరెంట్లకు వెళ్తాం, వెళ్లగానే ఫైవ్‌ స్టార్ హంగులు చూసి.. మురిసిపోతాం.. ఆర్డర్ ఇచ్చి తిని వచ్చేస్తాం. కానీ, ఆ ఆహారం మన ప్లేట్లోకి రాకముందు ఎంత పరిశుభ్రమైన వాతావరణంలో తయారైంది? అది అసలు తాజా ఆహారమేనా? అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఇలాంటి చిన్న చిన్న హోటళ్లే కాదు.. నగరంలో ఎంతో పేరు ఉన్న పెద్ద పెద్ద రెస్టరెంట్లలో కూడా ఆహార నాణ్యతలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల, మనం డబ్బులు పెట్టి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నాం.

భారీ బోర్డులు, ఫైవ్‌ స్టార్‌ హంగులు.. కానీ..

ఫైవ్‌ స్టార్ హంగులు, భారీ బోర్డులు, జనంతో కిటకిటలాడే రెస్టారెంట్లు.. కానీ కిచెన్‌లో పరిస్థితులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారుల కూడా ఖంగు తినేలా ఉన్నాయని అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో కొన్ని ప్రముఖ భోజనశాలల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కుళ్లిన ఆహారం, పరిశుభ్రత లేని వంటగదులు, పురుగుల సమస్యలు, నిబంధనలకు విరుద్ధంగా ఆహారం బయటపడ్డాయి.

కొన్ని చోట్ల అయితే వంటకు ఉపయోగించే కూరగాయలపై బూజు, మరికొన్ని చోట్ల ఆహార పదార్థాలకు కనీస లేబులింగ్ కూడా లేకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. జిడ్డు పట్టిన కిచెన్‌లు, దుమ్ముతో నిండిన తయారీ ప్రాంతాలు, ఉద్యోగుల ఆరోగ్య ధ్రువపత్రాల లేమి వంటి అంశాలు కూడా గుర్తించారు. ప్రజలేమో డబ్బులు చెల్లించి నాణ్యమైన ఆహారం తింటున్నామనుకుంటే, కొన్ని చోట్ల మాత్రం ఆరోగ్యాన్నే పణంగా పెడుతున్న పరిస్థితులు కనిపించాయని అధికారులు పేర్కొన్నారు.

ఇకనైనా అలర్ట్ అవ్వండి..

ఇకపై మీరు ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లినప్పుడు కేవలం హోటల్ డెకరేషన్, టేస్ట్ మాత్రమే కాదు.. ఆ రెస్టరెంట్‌లో FSSAI (ఫుడ్ సేఫ్టీ) లైసెన్స్ నంబర్ మరియు వారి హైజీన్ రేటింగ్ బోర్డు ఉందో లేదో గమనించండి. వీలైనంత వరకు వంటగది ఎలా ఉందో బయటకే కనిపించే రెస్టరెంట్లకు ప్రాధాన్యత ఇవ్వండి.
మీకు ఏదైనా హోటల్‌లో ఫుడ్ క్వాలిటీ బాలేకున్నా, అపరిశుభ్రంగా అనిపించినా.. వెంటనే ప్రభుత్వ అధికారిక ‘FoSCoS’ యాప్ ద్వారా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి.

బయట ఆహారం తినకూడాదు అని కాదు.. అది ఎంత వరకు తాజాగా ఉందనే విషాయన్ని గమనించాలి. ఇకపై మీరు ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లినప్పుడు కేవలం టేస్ట్ మాత్రమే కాదు.. ఆ రెస్టరెంట్‌లో హైజీన్ (పరిశుభ్రత) రేటింగ్ ఎంత ఉందో కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి.